నిజామాబాద్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆసరా పథకం కింద కొత్తగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సత్వరమే పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 3వ తేదీ లోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు.
ఆసరా పెన్షన్ల కు సంబంధించి జిల్లాలో కొత్తగా 48వేల పైచిలుకు మంది లబ్ధిదారులుగా ఎంపికైనందున, స్థానిక శాసన సభ్యులను, ఎంపీడీఓ లను సంప్రదించి వారి సమక్షంలో సత్వరమే కొత్త పెన్షన్ల పంపిణీని చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలని డీఆర్డీఓ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాగా, ప్రతీ చోట రైతు వేదికలు అన్ని సదుపాయాలు కలిగి ఉండేలా చూడాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.

తప్పనిసరిగా నీటి సౌకర్యం ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా టాయిలెట్స్ వంటివి అసంపూర్తి నిర్మాణాలు ఉంటే గుత్తేదార్ల చేత వాటిని వెంటనే చేపట్టి పూర్తి చేసేలా చూడాలన్నారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో పారిశుధ్యం పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల నడుమ ప్రతి రోజు చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలన్నారు.
పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో ఖాళీ ప్రదేశాలను గుర్తిస్తూ విరివిగా మొక్కలు నాటాలని, మినీ పల్లె ప్రకృతి వనాల కోసం అవసరమైన స్థలాన్ని త్వరితగతిన సేకరించాలని అన్నారు. జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందేలా ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు.
అటవీ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో హరితహారం విజయవంతానికి శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్ తదితరులు పాల్గొన్నారు.