నిజామాబాద్, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం 2019 ఆగస్టులో ప్రవేశపెట్టిన టీఎస్-బీపాస్ యాక్టును పూర్తి స్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ టీఎస్-బీపాస్ యాక్టు, పట్టణ ప్రగతి, హరితహారం తదితర అంశాలపై సమీక్ష జరిపారు.
నిబంధనలకు అనుగుణంగా చేపట్టే నిర్మాణాలకు సులభంగా అనుమతులు జారీ చేస్తూ, అక్రమ నిర్మాణాలను నిలువరించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం టీఎస్-బీపాస్ చట్టాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఇదివరకు మున్సిపల్ పరిధిలో చేపట్టే నిర్మాణాలకు కౌన్సిల్ అనుమతి, తీర్మానాలు చేసేవారని, ప్రస్తుతం వీటి అవసరం లేకుండా టీఎస్-బీపాస్ ద్వారా నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టే వారికి వెంటనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదే సమయంలో నిబంధనలను అతిక్రమిస్తూ చేపట్టే నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకూడదని సూచించారు.
అక్రమ నిర్మాణాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ప్రతి మున్సిపాలిటీలో వచ్చే సోమవారం నాటికి కంప్లైంటు బాక్స్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఫిర్యాదు ఏ రకంగా వచ్చినా, వెంటనే వివిధ శాఖల అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం క్షేత్రస్థాయికి చేరుకొని నిర్మాణాలను పరిశీలించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే నోటీసులు జారీ చేయడం, అక్రమ నిర్మాణాలను సీజ్ చేయడం, జరిమానాలు విధించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టాలని కరాఖండీగా తేల్చి చెప్పారు.
అక్రమ నిర్మాణాలకు సంబంధించి వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తూ, వాటిపై ఈమేరకు చర్యలు చేపట్టారన్నది క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరపాలని బల్దియా కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. పెండిరగ్ లో ఉన్న ఫిర్యాదులన్నింటిని సత్వరమే పరిష్కరించాలని, పక్షం రోజుల అనంతరం ఏ ఒక్క ఫిర్యాదు కూడా అపరిష్కృతంగా ఉండకూడదన్నారు.
కాగా, టీఎస్-బీపాస్ యాక్టు అమలులోకి రాకముందు పూర్తయిన నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు వంటి చర్యలకు ఉపక్రమించకూడదని కలెక్టర్ సూచించారు. 2019 ఆగస్టు నెలకు ముందు నిర్మాణాలు పూర్తయిన వాటిలో అతిక్రమణలు ఉంటే ఇతర నిబంధనల ప్రకారంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులకు ప్రాధాన్యత ఇస్తూ సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ముఖ్యంగా సమీకృత మార్కెట్ యార్డుల నిర్మాణాలను వేగవంతం చేయించాయలని, వైకుంఠధామాల్లో నీటి సౌకర్యం, విద్యుత్ వసతిని కల్పిస్తూ ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కరెంటు సరఫరాలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని హితవు పలికారు. హరితహారం లో నాటిన ప్రతి మొక్క బతకాలని, నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటితే సంబంధిత అధికారుల నుండి నిధులు రికవరీ చేయిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
ప్రధాన రహదారులకు ఇరువైపులా అందుబాటులో ఉండే స్థలాన్ని బట్టి పలు వరుసలుగా అందమైన పూల మొక్కలు నాటించాలని సూచించారు. మొక్కలు లేని రహదారి అంటూ ఏదీ ఖాళీగా కనిపించకూడదని, ప్రధాన మార్గాలన్నిటిలో కనీసం ఐదు కిలోమీటర్ల పొడుగునా ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పడేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.