నందిపేట్, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలో పందుల సైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రోగాల బారిన పడుతున్నారని అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నారని గ్రామ అధ్యక్షులు పెదకాపు సుమన్ ఎద్దేవా చేశారు. నందిపేట మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి పందుల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు.
రాస్తారోకో కారణంగా దాదాపు 3 గంటల పాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. స్థానిక ఎస్సై ఆరిఫొద్దీన్, ఎంపీఓ కిరణ్ జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడిరచగా డిపిఓ తక్షణమే గ్రామపంచాయతీతో పందుల నిర్ములన కొరకుశాశ్వత పరిష్కారముగా తీర్మానం చేయిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు పెద్దకాపు సుమన్ మాట్లాడుతూ నందిపేట మండల కేంద్రంలో పందులు గత కొన్ని సంవత్సరాల నుండి స్వైర విహారం చేస్తున్నా ఎవరు పట్టించుకోవడంలేదని పందుల వల్ల గ్రామమంతా అపరిశుభ్రంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతూ రోడ్డున వెళ్లేవారికి పందులు అడ్డమొచ్చి ప్రమాదాలకు గురవుతున్నారని, అంతేకాకుండా గ్రామ పరిసర ప్రాంతాల రైతులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే అధికారులు చర్య తీసుకుని గ్రామంలో పందులు లేకుండా చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. స్థానికుడు మంద మహిపాల్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత కొరకు గ్రామ అభివృద్ధి కమిటీ రోడ్డుపై బైఠాయించే పరిస్థితి వచ్చిందంటే ప్రజాప్రతినిధులు అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిసిపోతుందని వెంటనే పందుల పెంపకదారులపై చర్య తీసుకుని గ్రామంలో పందులు లేకుండా చేయాలని లేదంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మూడు పంతల అధ్యక్షులు, అన్ని కులాల పెద్ద మనుషులు, సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు.