డిచ్‌పల్లి, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని కల్చరల్ ఆక్టివిటీస్ అండ్ యూత్ వెల్ఫేర్ డైరెక్టర్ డా. వంగరి త్రివేణి తెలిపారు.
అందులో భాగంగా సోమవారం ఉదయం వ్యాసరచన పోటీని ‘‘భారతదేశ సమగ్రాభివృద్ధిలో విద్యార్థుల భూమిక’’ అనే అంశంపై, మధ్యాహ్నం వక్తృత్వం పోటీని ‘‘జాతీయ విద్యా వికాసంలో విద్యార్థుల ఆలోచనా పథం’’ అనే అంశంపై నిర్వహించామని తెలిపారు. పోటీలకు డా. జి. బాల శ్రినివాస మూర్తి, డా. కె. వి. రమణాచారి, డా. ప్రవీణాబాయి, డా. గుల్ – ఇ – రాణా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని అన్నారు.
పోటీలు తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషల్లో నిర్వహించామని అన్నారు. ప్రతి భాషలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను వార్షికోత్సవంలో ప్రదానం చేస్తామని చెప్పారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ తమ సృజనాత్మక కళను ప్రదర్శించారన్నారు. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోభివృద్ధి కోసం జాతీయ విద్య పాటుబడాలని, బహుముఖాలుగా వికాసం చెందాలని విద్యార్థులు తమ ఉపన్యాసంలో పేర్కొన్నారని అన్నారు.
పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య బి. విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి శుభాభినందనలు తెలిపారు.