ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్‌ ఉత్సవాలు

నిజామాబాద్‌, ఆగష్టు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో వినాయక వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు వంటి సౌకర్యాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జిల్లాలో ఎంతో సహృద్భావ వాతావరణంలో వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ముఖ్యంగా గణేష్‌ పండుగ సందర్భంగా భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ ఒక్క ప్రాణ నష్టం సంభవించకూడదని అన్నారు. ముఖ్యంగా విద్యుదాఘాతం బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

వినాయక మంటపాలు ప్రతిష్టించే గణేష్‌ మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా ట్రాన్స్‌కోకు నామమాత్రపు రుసుము చెల్లించి అధికారిక కనెక్షన్లు పెట్టించుకోవాలని హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్‌ వైర్లకు కొండీలు తగిలించి ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ఈ విషయంలో ట్రాన్స్‌కోతో పాటు పోలీసులు, ఇతర శాఖల అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఆయా ప్రాంతాల్లో నెలకొల్పే గణేష్‌ మంటపాలు వివరాలను తప్పనిసరిగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, నిర్వాహకులకు జాగ్రత్తలు సూచించాలని పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా కూడా ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు విగ్రహాల నిమజ్జనం చేసే ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో జరగాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రేన్‌, లైటింగ్‌ వ్యవస్థ, అత్యవసర వైద్యం, తాగునీరు, ప్లాటుఫారం, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ప్రజలు ఎలాంటి అపోహలు, వదంతులను నమ్మకూడదని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తెస్తే తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని పోలీస్‌, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు.

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, అదనపు డీసీపీ అరవింద్‌ బాబు, డిప్యూటీ మేయర్‌ ఇద్రీస్‌, ఆర్దీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »