నిజామాబాద్, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేతన పెంపు బకాయిలు విడుదల చేయాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు యూనిఫాంలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి. యు) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు 30 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. గత 2021 జూన్ నుండి వేతన పెంపు అమలు చేస్తామని, నాటి నుండి వేతన పెంపు బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటికీ బోధన్, ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు వేతన పెంపు బకాయిలు విడుదల కాలేదన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్మికులకు కేవలం 04 నెలల బకాయిలు ఇచ్చారన్నారు. వెంటనే వేతన పెంపు బకాయిలను ఒకే విడతలో అందజేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం నియమించబడ్డ మున్సిపల్ డ్రైవర్లకు వేతన పెంపు ను అమలు చేసిన పాలక మండలి, కార్మికులకు మాత్రం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులందరికీ వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 330 మంది కార్మికులకు రెండు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. పర్మినెంట్ కార్మికులకు యూనిఫాంలు, డ్రెస్సులు, చీరలు ఇచ్చిన ప్రభుత్వం, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను విస్మరించడం సరైంది కాదన్నారు.
వీరికి కూడా గుర్తింపు కార్డులు, యూనిఫామ్ బట్టలు, పనిముట్లు, చెప్పులు, సబ్బు, నూనెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి.మల్లేష్, జిల్లా నాయకులు టి.విటల్, కె.రాజేశ్వర్ శివకుమార్, డి.కిరణ్, సైదులు, శాంతికుమార్, నర్సయ్య, గంగాధర్, రజిని, కళావతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.