డిచ్‌పల్లి, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్ ఆక్టివిటీస్ అండ్ యూత్ వెల్ఫేర్ డైరెక్టర్ డా. వంగరి త్రివేణి తెలిపారు.
కాగా, అందులో భాగంగా మంగళవారం ఉదయం ‘‘చిత్రలేఖనం’’, మధ్యాహ్నం ‘‘రంగోళి’’ పోటీలను నిర్వహించామని తెలిపారు. పోటీలకు బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. వాణి, మాస్ కమ్యూనికేషన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పి. శాంతాబాయి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని అన్నారు.
పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు చక్కని చిత్రాలను చిత్రించి, రంగులతో అలంకరించారని అన్నారు. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, నదీ నదాలు, చెట్లు చేమలతో గ్రామ ముఖచిత్రాన్ని అందంగా చిత్రించారని అన్నారు. సందేశాత్మకమైన అంశంతో ప్రతి ఒక్కరు ఒక్కో కొటేషన్‌ను పొందుపరిచారని అన్నారు. ఆడ పిల్లల సంరక్షణ, వాతావరణ పరిరక్షణ, విద్యా ప్రాముఖ్యత, జాతీయ సమైక్యత, పండుగలు, ఉత్సవాలను రంగులతో నింపి అద్భుతంగా చిత్రించారని అన్నారు.
చిత్రలేఖనం, రంగోళి పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను వార్షికోత్సవంలో ప్రదానం చేస్తామని చెప్పారు. పోటీల్లో ఉత్సహంగా పాల్గొంటున్న విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య బి. విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి శుభాభినందనలు తెలిపి ప్రోత్సహించారు.