హైదరాబాద్, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో మాట్లాడే భాష మాండలికం కాదని, అది మూల భాషకు దగ్గరగా ఉన్న జీవద్భాష అని డా. నలిమెల భాస్కర్ వ్యాఖ్యానించారు. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ. సి. కాశీం అధ్యక్షతన జరిగిన ‘‘తెలుగు భాష – గిడుగు ప్రాసంగికత’’ అనే అంశంపై మాట్లాడుతూ భాష నిరంతరం మార్పులకు లోనవుతుందని, పరిశోధకులు సునిశిత పరిశీలనతో మార్పులను గుర్తించాలని సూచించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. చింతా గణేష్ మాట్లాడుతూ ఉస్మానియా తెలుగు శాఖలో జరుగుతున్న భాష కృషిని ప్రశంసించారు. తెలుగు భాషపై నిరంతర పరిశోధన చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చని సూచించారు.
ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి అట్టడుగు స్థాయిలో ఉన్న సవరజాతి ప్రజల భాషపై ఉన్నతమైన పరిశోధన చేశారని గుర్తు చేశారు. ఆనాడు వ్యవహారిక భాషకు పట్టం కట్టి నేడు సాహితీ లోకంలో ఉన్న మార్పులకు కారణమయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ప్రొఫెసర్ నిత్యానందరావు, డా. సాగి కమలాకర్ శర్మ, డా. ఎస్. రఘు, డా. ఏ. విజయలక్ష్మి, పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు, వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.