పెన్షన్ల పంపిణీలో దేశంలోనే నెంబర్‌ వన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌గా ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ తరహాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ జరగడం లేదని అన్నారు. 57 సంవత్సరాలు పైబడిన వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆసరా పథకం కింద ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ల మంజూరీ పత్రాలను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తన చేతుల మీదుగా అందజేశారు.

బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే 52 వేల మందికి ఆసరా పెన్షన్లు అందుతుండగా, కొత్తగా 10 వేల మందికి పెన్షన్ల జాబితాలో చోటు కల్పించారు. వేల్పూరు, మోర్తాడ్‌, బాల్కొండ మండల కేంద్రాల్లో మంగళవారం మంత్రి వేముల లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరీ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఎనలేని ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, పేదల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు.

వయసు పైబడిన వారు వార్ధాక్య దశలో ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలనే సదాశయంతో 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు తెలంగాణలో పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి కొత్త పెన్షన్లను రెండేళ్ల క్రితమే పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా సంక్షోభం కారణంగా జాప్యం జరిగిందన్నారు. ఎట్టకేలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు.

అభివృద్ధి నమూనాగా గొప్పలు చెప్పుకునే గుజరాత్‌ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో 20 రెట్లు అధికంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు. 6.30 కోట్ల మంది జనాభా కలిగిన గుజరాత్‌ రాష్ట్రంలో కేవలం 13.50 లక్షల మందికి నెలకు కేవలం వంద కోట్ల రూపాయల వరకే పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. వృద్దులకు 750 రూపాయలు, ఒంటరి మహిళలకు 950 , వికలాంగులకైతే కేవలం 600 రూపాయల చొప్పున మాత్రమే గుజరాత్లో పెన్షన్ల పంపిణీ జరుగుతోందన్నారు.

అందుకు భిన్నంగా కేవలం 3 .80 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 48 లక్షల మందికి నెలకు అక్షరాలా వేయి కోట్ల రూపాయల చొప్పున పెన్షన్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ లో 23 కోట్ల జనాభా ఉంటే, కేవలం 86 లక్షల మందికి నెలకు 430 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ల కింద అందిస్తున్నారని అన్నారు. హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉందన్నారు. తాను చెప్పేవన్నీ ముమ్మాటికీ వాస్తవాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఈ సందర్భంగా ప్రమాణ పూర్వకంగా పేర్కొన్నారు.

ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తెలంగాణాలో కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పాలనకు మద్దతుగా నిలువాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 22 లక్షల మందికి నెలకు 200 రూపాయలు మాత్రమే పెన్షన్లు అందేవని, కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం వాటి సంఖ్య 48 లక్షలకు పెరిగిందని, పెన్షన్‌ మొత్తాన్ని 200 రూపాయల నుండి 2016 రూపాయలకు పెంచడం జరిగిందని, వికలాంగులకు 3016 రూపాయలు అందిస్తున్నామని గుర్తు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 2.38 లక్షల మందికి ఆసరా పథకం కింద ప్రతీ నెల 50 కోట్ల రూపాయల చొప్పున పంపిణీ జరిగేదని, ప్రస్తుతం కొత్తగా 48 వేల మందికి పెన్షన్లు మంజూరు కావడంతో ఇక నుండి నెలనెలా 2.86 లక్షల మందికి 60 కోట్ల రూపాయలను పెన్షన్ల కింద అందించడం జరుగుతుందన్నారు.

బాల్కొండ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన పది వేల మందిని కలుపుకుని మొత్తం 62 వేల మందికి ప్రతీ నెల 13 కోట్ల రూపాయల చొప్పున పెన్షన్ల పంపిణీ జరుగుతుందని వివరించారు. ఇంకనూ అర్హులైన వారు మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా వారికి కూడా పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి భరోసా కల్పించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆర్మూర్‌ ఆర్దీవో శ్రీనివాసులు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌, డీఎల్‌పీఓ శ్రీనివాస్‌, మోర్తాడ్‌ ఎంపిపి శ్రీనివాస్‌, ఎం.ఏ.అజీస్‌, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »