నిజామాబాద్, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిజామాబాద్‌కు విచ్చేస్తున్న సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) వద్ద చేపడుతున్న ఏర్పాట్లను గురువారం పోలీస్ కమిషనర్ నాగరాజుతో కలిసి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరిశీలించారు.
అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. న్యూ కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ సందర్భంగా చేపట్టాల్సిన చర్యల గురించి ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ బాధ్యతలు పురమాయించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఏ చిన్న తప్పిదానికి సైతం ఆస్కారం కల్పించకూడదని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
5 న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లాకు చేరుకొని సమీకృత జిల్లా కార్యాలయాలతో కూడిన నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవంతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఇందల్వాయి నుండి కొత్త కలెక్టరేట్ వరకు ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లకు ఇరువైపులా పచ్చదనంతో కళకళలాడేలా ఖాళీ ప్రదేశాల్లో యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎక్కడ కూడా రోడ్లపై చెత్తాచెదారం ఉండకుండా అన్ని ప్రాంతాలను శుభ్రం చేయించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగేందుకు ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని హితవు పలికారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతాపరమైన ఏర్పాట్లకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నామని, సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు వెల్లడిరచారు.
ముఖ్యమంత్రి పర్యటన విధుల్లో నిమగ్నమై ఉండే అధికారులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, ఆర్ అండ్ బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.