నిజామాబాద్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఓటరు తమ ఓటరు కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేసుకునేలా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. ఈ అంశం శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ఓటరు జాబితాలో పేర్లు కలిగి ఉన్న వారందరు ఆధార్ లింకేజీ చేసుకునేలా విస్తృత చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామ స్థాయి నుండి మున్సిపాలిటీ వరకు అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా సమావేశాలు నిర్వహిస్తూ ఆధార్ అనుసంధానం చేసుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా వారి కుటుంబంలోని ఓటర్ల వివరాలు, ఆధార్ నెంబర్లను సేకరించి నిర్ణీత ఫారం-6 (బి) ద్వారా ఓటరు కార్డుకు అనుసంధానం చేసే ప్రక్రియను ఈ నెల 10 వ తేదీ లోపు పూర్తి చేయాలని డీఆర్‌డీఓ, మెప్మా అధికారులను ఆదేశించారు.
అలాగే, 2005 జనవరి 01 వ తేదీ కంటే ముందు జన్మించిన వారు ఇంకనూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోకపోతే, అలాంటి వారి వివరాలను సైతం మహిళా సంఘాల సభ్యుల ద్వారా సేకరించి నిర్ణీత ఫారం-6 (ఏ) ద్వారా ఓటరు జాబితాలో వారి పేర్లు నమోదు చేయించాలని సూచించారు. ఈ విషయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలు క్రియాశీలక పాత్ర పోషించాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పంచాయతీ కార్యదర్శులను బీఎల్‌ఓలుగా నియమించుకుని ఆధార్ అనుసంధానం, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలను నూటికి నూరు శాతం నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, ఆధార్ అనుసంధానం తదితర వాటి గురించి బీఎల్‌ఓలకు శిక్షణ ఏర్పాటు చేసి పరిపూర్ణమైన అవగాహన కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ సునీల్, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.