నిజామాబాద్, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 5వ తేదీన నిజాంబాద్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ నగర ప్రజల తరఫున సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఎంకి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ నూతన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్, పాత కలెక్టర్ కార్యాలయం స్థలాన్ని రియల్టర్లకు అప్పగిస్తారేమోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారన్నారు.
పూలంగ్ వాగును రియల్టర్ల కబ్జాల నుండి కాపాడాలన్నారు. నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోగా, మరింత పెరిగాయన్నారు. శివారు ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా మారి ప్రజలకు ప్రతిరోజు నరకం కనబడుతుందన్నారు. ఇప్పటికి నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదన్నారు. మారుమూల ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కూడా లేదన్నారు.
ఇక విలీన గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతమన్నారు. కార్పొరేషన్లో కలవడంతో వారికి ఉపాధి హామీ పథకం దూరమైందన్నారు. టాక్స్‌లు పెరిగాయి కానీ, సౌకర్యాలు పెరగలేదు అన్నారు. నగర ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో రూరల్ సబ్ డివిజన్ కార్యదర్శి సిహెచ్ సాయగౌడ్, నగర నాయకులు బి. గోదావరి, కే.సంధ్యరాణి, టి.విఠల్, కే. భాగ్య తదితరులు పాల్గొన్నారు.