డిచ్‌పల్లి, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్ ఆక్టివిటీస్ అండ్ యూత్ వెల్ఫేర్ డైరెక్టర్ డా. వంగరి త్రివేణి తెలిపారు.
కాగా, అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం డ్యాన్స్ పోటీని నిర్వహించామని తెలిపారు. పోటీలకు కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. రాంబాబు, స్టాటిస్టిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. కె. సంపత్ కుమార్, న్యాయ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ డా. నర్సయ్య, డా. ప్రవీణ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని అన్నారు.
పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య సంగీతాలతో కూడిన పాటలకు సోలో అండ్ గ్రూప్‌లలో డ్యాన్స్ చేసి తమ తమ సృజనాత్మక కళను, ప్రతిభను కనబరిచారని అన్నారు. పోటీల్లో ఉత్సహంగా పాల్గొంటున్న విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య బి. విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి శుభాభినందనలు తెలిపి ప్రోత్సహించారు.