నిజామాబాద్, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇంకనూ అక్కడక్కడా మిగిలిపోయి ఉన్న తుదిదశ పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందులో భాగంగానే కలెక్టర్ శనివారం న్యూ కలెక్టరేట్ ను సందర్శించి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.
ప్రారంభోత్సవ శిలాఫలకంతో పాటు ఆయా అధికారుల ఛాంబర్లను, సమావేశ మందిరం, మినీ కాన్ఫరెన్స్ హాల్ తదితర వాటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయినప్పటికీ తుది దశ పనులను యుద్ధప్రాతిపదికన జరిపిస్తూ, ఆదివారం సాయంత్రం లోగా న్యూ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభోత్సవానికి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి చిన్న విషయాన్ని సైతం పరిగణలోకి తీసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని హితవు పలికారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ వారికి కేటాయించిన బాధ్యతలను అంకితభావంతో సమర్ధవంతంగా నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్డీఓ రవి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ రాజేశ్వర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్ తదితరులు ఉన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన
కాగా, నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి నుండి డిచ్‌పల్లి వరకు 44 వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా హరితహారం కింద నాటిన మొక్కలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. డిచ్‌పల్లి ఐ-ల్యాండ్ వద్ద, మరికొన్ని ప్రదేశాల్లో అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణలో లోపాలను గుర్థించిన కలెక్టర్, వాటిని సరిచేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఖాళీ ప్రదేశాల్లో యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటించాలని, ఇప్పటికే ఏపుగా పెరిగిన మొక్కల చుట్టూ పిచ్చిమొక్కలు, పొదలను తొలగించి శుభ్రం చేయించాలని, రహదారికి ఇరువైపులా పరిసర ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉండేలా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రధానంగా మీడియన్ నిర్వహణను గాడిలో పెట్టాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఎఫ్ ఆర్ ఓ హిమచందన తదితరులు ఉన్నారు.