కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
గాంధారి, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులను ఆదుకోవడంలో రాజకీయాలకు చోటు ఉండకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలోని మారుతీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ ప్రవాస యోజన రైతు సమ్మేళనంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులు వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న పతకాలను మంత్రికి వివరించారు.
అదేవిదంగా రైతులు తమ సమస్యలను తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్రం రైతులకు ఏ విధంగా సహాయ పడుతుందో ప్రసంగించారు. 2016 నుండి దేశంలోని రైతుల కొరకు కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఎప్పటికప్పుడు కిసాన్ మోర్చా ద్వారా రైతుల సమస్యలను కేంద్రం తెలుసుకుంటూనే ఉందని అన్నారు. రాజకీయాలకు చోటు లేకుండా రైతు సంక్షేమం చూస్తూ, కేంద్ర ప్రభుత్వం రైతుకు అధిక లాభం కల్పిస్తుందని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులకు ఆదుకోవాలని అన్నారు. ఎవరు ఏమి చేసినా అది రైతులకు న్యాయం చేసే విధంగా ఉండాలని అన్నారు. రైతు పెట్టుబడి సహాయం కింద కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుకు ఎకరాకు 6 వేలు ఇస్తున్నామని అన్నారు. కేంద్రం రైతులకు ఇచ్చే పెట్టుబడి తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయం చేయాలనీ అన్నారు. అంతే కానీ మీరు ఇచ్చేది సరిపోదు, మేమే ఇస్తాం అనే ధోరణి రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. గతంలో వరి, మొక్కజొన్న పంటలు వేస్తున్న రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన తీరు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని అన్నారు.
రాజకీయ దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహారించిందని అన్నారు. గిరిజన ప్రాంతాలలో అధికంగా మొక్కజొన్న పండిస్తారని, అలాంటిది వారిని మొక్కజొన్న వేయకుండా కేంద్రంపై నింద వేసే ప్రయత్నం చేసిందని అన్నారు. వరి వేస్తే ఉరే అని బెదిరింపులకు పాల్పడిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. బెదిరించే వాతావరణం రైతుల విషయంలో కల్పించకూడదని హితవు పలికారు.
భూనిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు
ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును కేంద్ర మంత్రి తప్పు పట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కేంద్రంతో సంబంధం లేకుండా పనులను ప్రారంభించారని అన్నారు. అలాగే ప్రాజెక్ట్ నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు ఇప్పటి వరుకు నష్ట పరిహారం అందలేదని అన్నారు. మల్లన్న సాగర్, మానేరు, సీతారామ వంటి నీటి ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులు రోడ్డున పడ్డారని అన్నారు. కనీసం వాళ్ళను ఆడుకోవాలనే ధ్యాస రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ లకు భూములు ఇచ్చిన రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ఆడుకోవాలని డిమాండ్ చేశారు.
రైతు ఆత్మహత్యలలో తెలంగాణ
రైతు ఆత్మహత్యలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సిఆర్బి నివేదిక ప్రకారం 2017 నుండి 2019 మధ్య కాలంలో 2237 మంది రైతులు తెలంగాణ లో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని మేమే చేస్తున్నాం అని చెప్పుకుంటుందని, మరి ఈ ఆత్మహత్యలు ఎలా జరిగాయాని ప్రశ్నించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పక్కరాష్ట్రాలతో పోలుస్తారు. పక్క రాష్టంలో మన తెలంగాణ కన్నా ఎక్కువ రైతు ఆత్మహత్య జరిగాయాని రాజకీయం చేస్తారని తెరాస ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. రైతు పెట్టుబడి సహాయం కౌలు రైతులకు ఇవ్వడం లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని అన్నారు.
నూటికి ఐదుగురికే రుణ మాఫీ
టీఆర్‌ఎస్ గత ఎన్నికలకు ముందు రైతులకు లక్ష వరకు పూర్తి వ్యవసాయ రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంది రైతులకు పూర్తి రుణ మాఫీ అయిందని అడిగారు. తెలంగాణలో కేవలం నూటికి ఐదు గురికి మాత్రమే రుణమాఫీ అయిందని తెలిపారు. పక్క రాష్టాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని అన్నారు. పక్క రాష్ట్రలైన మహారాష్ట్రలో 100 కి 68 మందికి, కర్ణాటకలో 100 కి 38 మందికి, ఉత్తర్ ప్రదేశ్ లో 100 కి 52 మందికి, పంజాబ్ లో 100 కి 24 మందికి, మధ్యప్రదేశ్ లో 100 కి 12 మంది రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ అయినట్లు గణంకాలు చెప్తున్నాయని అన్నారు. ఇది కూడా సరిపోదని రైతులు పూర్తిగా రుణ విముక్తులు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎన్ని నిధులు ఇచ్చారో అక్షరాలా కేంద్ర మంత్రి తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఎకరానికి 6 వేల చొప్పున 2014 నుండి 7658 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసిందని అన్నారు. దీని ద్వారా 3795 లక్షల రైతులు లబ్ది పొందారని అన్నారు. కిసాన్ వికాస్ యోజన ద్వారా 895 కోట్లు, నూనె పప్పు దినుసులు ద్వారా 1366 కోట్లు, ఇన్సెంటివ్ ద్వారా రైతులకు 515కోట్లు, పెన్షన్ పరంపర పతకం ద్వారా 10468 కోట్లు తో కలిపి సుమారు 10729 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి మోడీ తెలంగాణ రైతులకు ఇచ్చారని వివరించారు.
కేంద్రం రైతులకు ఇచ్చే నిధులను రైతులకు తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 10 వేల రూపాయలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని అన్నారు.
సబ్సిడ పై రైతులకు సరిపడా ఎరువులు
వ్యవసాయంలో రైతులకు సరిపడా ఎరువులను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పై ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని మంత్రి అన్నారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోడీ కొరత లేకుండా ఎరువులను అందిస్తున్నారని అన్నారు.2016 ముందు యూరియా కొరత ఉండేదనిఇప్పుడు కొరత లేదని అన్నారు. ఖరీఫ్ 2022 చివరి రైతులకు సరిపడా ఎరువులు దొరకాలని సబ్సిడీ పై అందిస్తున్నట్లు తెలిపారు.
ఇంపార్టెట్ యూరియా 2450 రూపాయలకు ఒక బస్తా ఉంటే దానిని 270 రూపాయలకే రైతులకు సబ్సిడీపై ఇస్తున్నామని అన్నారు. అలాగే డిఏపి పై 2501 రూపాయల సబ్సిడీ ఇచ్చి 1350 కే ఇస్తున్నామని, ఎన్పిఏ 1918 సబ్సిడీ ఇచ్చి 1470 కే ఇస్తున్నామని ఇలా ప్రతి ఎరువును అందిస్తున్నామని అన్నారు. రైతుల కొరకు కేంద్రం 3406 రైతు కేంద్రాలను తెలంగాణకు మంజూరు చేస్తే కేవలం 1400 కేంద్రాలను మాత్రమే అందుబాటులో ఉంచిందని అన్నారు.
ఏథోనల్ తయారీ ద్వారా చెరుకు రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. రైతులు ఎక్కువ ఎరువులు వాడి భూమి సమర్త్యాన్ని తగ్గించవద్దని అన్నారు. నానో ఎరువులు వాడాలని సూచించారు. ప్రతి రైతు సాయిల్ హెల్త్ కార్డ్ కల్గిఉండాలని అన్నారు. భూసారా పరీక్షల ద్వారా భూమి ఏ పంటకు అనువైనదో తెలుస్తుందని అన్నారు. రైతులు సోలార్ ఎనర్జీ ని వాడుకోవాలని అన్నారు. సోలార్ కొరకు కేంద్రం సబ్సిడీ కూడా ఇస్తుందని అన్నారు. ప్రతి రాష్ట్రంలో రైతులు తాము పండిరచిన పంటను ఎక్కడైనా ఏ ధరకైనా అమ్ముకునే వీలును కేంద్రం కల్పించిందని అన్నారు.
అందుకొరకు ప్రతి రాష్ట్రంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టోరేజ్ కేంద్రాలతో రైతులకు ఎక్కువ లాభం వస్తుందని అన్నారు. స్టోరేజ్ కేంద్రాలలో రైతులు పండిరచిన ధాన్యాన్ని నిలువ చేసి ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తోందో అప్పుడు అమ్ముకోవచ్చని అన్నారు. రైతులు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రోసెసింగ్ యూనిట్ కొరకు కేంద్రం మొదటి 5 సంవత్సరాల వరకు ఎలాంటి పన్ను తీసుకొదని అన్నారు. రైతులు గౌరవంగా బ్రతకటానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని అన్నారు.
దేశంలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని 80 కోట్ల రేషన్ కార్డ్ కల్గిన కుటుంబలకు ఉచితంగా సరకులు అందిస్తున్నామని తెలిపారు. రైతులు ఆదాయం రెట్టింపు కావాలని కోరుకుంటున్నానని రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకువాలని , రైతులకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, నాయకులు మురళిదర్ గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, పైల కృష్ణ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, సాయిబాబా, శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.