జిల్లాకు సిఎం రాక
ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తుండంతో జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గత మూడు రోజులుగా నిజామాబాద్‌ నగరంలో తిష్ట వేసి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారు.

సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రెండు వేల పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు తెలిపారు. నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సముదాయ భవనం, అదేవిధంగా తెరాస జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. కలెక్టర్‌ కార్యాలయ సముదాయంతో పాటు తెరాస కార్యాలయాన్ని అలంకరించారు. సుదీర్ఘ కాలం అనంతరం సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనకు రానున్నడంతో ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

గతంలో తెరాస ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం పర్యటన సందర్భంగా ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు బహిరంగ లేఖలు రాశారు. ప్రధానంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన షుగర్‌ ఫ్యాక్టరీపై కెసిఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆసియాలోనే మొదటి ర్యాంకుగా ఉన్న బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగే విధంగా సీఎం ప్రకటన చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ఎన్సీఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అవసరమాకు ఖర్చు కోసం పది కోట్లు కేటాయించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన విధంగా దళిత పేద కుటుంబాలకు మూడెకరాల భూమి కేటాయించాలని వివిధ దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ భూ పంపిణీ చేయడం లేదని, సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, అటవీ శాఖల మధ్య పెండములో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల చేయాలని జిల్లా ప్రజలు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం స్పందించి మహిళా డిగ్రీ కళాశాలకు ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 100 కోట్లు కేటాయించాలని వివిధ విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సోమవారం జిల్లా పర్యటన సందర్భంగా నగరం గులాబీమయం అయింది. నూతన కలెక్టర్‌ కార్యాలయాన్ని అలంకరించారు. నగరం మొత్తం హోర్డింగులతో ముంచెత్తారు. సీఎం కేసీఆర్‌ పర్యటన మార్గం మొత్తం గులాబీ ఫ్లెక్సీలతో నిండిపోయింది.

ముందుగా తెరాస కార్యాన్ని ప్రారంభించి అక్కడనుండి నేరుగా కొత్త కలెక్టర్‌ కార్యాలయ సమూదాయానికి చేరుకుంటారు. నూతన కలెక్టర్‌ భవనాన్ని ప్రారంభించి అనంతరం గవర్నమెంట్‌ గిర్రాజ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. బహిరంగ సభకు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి జనసమీకరణ కోసం స్థానిక ఎమ్మెల్యేలు నిమగ్నమై ఉన్నారు. తెరాస జిల్లా అధ్యక్షులు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »