ముఖ్యమంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా న్యూ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌) ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తన చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. హైదరాబాద్‌ నుండి హెలికాప్టర్‌ ద్వారా సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి హెలిప్యాడ్‌ వద్ద స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం గుండా న్యూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా నేతలు, అధికారులు ముఖ్యమంత్రిని స్వాగతిస్తూ పూల బొకేలు అందించగా, అర్చకులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత 25 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో రూ. 53.52 కోట్ల వ్యయంతో మూడు అంతస్తుల్లో అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం శిలా ఫలకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించి, అట్టహాసపు ఏర్పాట్ల నడుమ పండుగ వాతావరణంలో న్యూ కలెక్టరేట్‌ను ప్రారంభించారు.

కలెక్టరేట్‌ భవన సముదాయం అంతటా ముఖ్యమంత్రి కలియతిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరస్వతీ పూజ చేశారు. కలెక్టర్‌ చాంబర్‌లోని కుర్చీలో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిని సీఎం కేసీఆర్‌ తానే స్వయంగా కూర్చుండబెట్టి, ఆశీర్వచనాలు అందించారు. నూతన జిల్లా పరిపాలనా భవనం అందుబాటులోకి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కలెక్టర్‌ ఛాంబర్లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. కలెక్టరేట్‌ నిర్మాణంలో భాగస్వాములైన వారికి సీఎం కండువాలు కప్పి, సన్మానించారు. జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి ఫొటోలు దిగారు. అంతకుముందు కలెక్టర్‌ నారాయణరెడ్డి సతీసమేతంగా తన చాంబర్‌లో వాస్తు పూజ నిర్వహించారు. కాగా, పరిపాలనా సౌలభ్యం కోసం ఒకేచోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

25 ఎకరాల్లో రూ.53.52 కోట్లతో దాదాపు 1 లక్ష 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్‌ సముదాయం ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తున్న క్రమంలో ‘క్రెస్ట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’ కొనసాగుతున్నదన్నారు. ఈ అభివృద్ధిని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, కొత్త కలెక్టరేట్‌ ప్రారంభం సందర్భంగా అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్‌కు కలెక్టర్‌ నారాయణరెడ్డి శాలువాలు కప్పి, సన్మానించి, మెమెంటోలు బహూకరించారు. కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ వెంట స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, కె.ఆర్‌.సురేష్‌ రెడ్డి, బీబీపాటిల్‌, ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వి.గంగాధర్‌ గౌడ్‌, డి.రాజేశ్వర్‌ రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, మహ్మద్‌ షకీల్‌, గంప గోవర్దన్‌, హన్మంత్‌ షిండే, జాజుల సురేందర్‌, కామారెడ్డి జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ శోభ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మార్క్‌ ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, మేయర్‌ దండు నీతూకిరణ్‌, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆరుట్ల రాజేశ్వర్‌ రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ మేయర్‌ ఆకుల సుజాత, తదితరులు పాల్గొన్నారు. కాగా, ముఖ్యమంత్రి విచ్చేసిన సందర్భంగా న్యూ కలెక్టరేట్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముఖ్యమంత్రి పర్యటన సజావుగా జరిగింది.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »