కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బావితరాలకు మేధావులను అందించడం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం 50 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని చెప్పారు. సమాజ ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని తెలిపారు. విద్యార్థుల్లో ప్రేరణ కల్పించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. జెడ్పి చైర్ పర్సన్ శోభ మాట్లాడారు.
విద్యార్థులు సరైన మార్గంలో నడిచే విధంగా బోధన అందించడం ఉపాధ్యాయుల కర్తవ్యం అన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించినప్పుడు ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసిన వారు అవుతారని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు తమ మేధాశక్తిని, విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, అధికారులు లింగం, గంగా కిషన్, వేణు శర్మ, ఉమారాణి, సిద్ధిరాంరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.