నిజామాబాద్, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2014 కన్నా ముందు చాలా మంది నాయకులు వచ్చారు పోయారనీ, 50 ఏళ్ళలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక కెసిఆర్ నిజామాబాద్ నగరానికి నిధులిచ్చి అభివృద్ధి చేయిస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుప్తా మాట్లాడుతూ సిఎం కేసీఆర్ పర్యటనకు మూడు రోజుల ముందు బిజెపి భారీ బహిరంగ సభ అని ఫ్లెక్సీలు వేశారని, ఒక చిన్న ఫంక్షన్ హాల్‌లో ఐదు వందల మందితో నిర్వహించింది భారీ బహిరంగ సభ ఎట్లవుతదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో చేపట్టిన తెరాస బహిరంగ సభను భారీ బహిరంగ సభగా వర్ణించారు. బిజెపి నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే అభివృద్ధిలో పోటీ పడాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. పించన్లు తమ ప్రభుత్వం రెండు వేలిస్తున్నామని, దాన్ని పెంచి ఇవ్వండని ఆయన సూచించారు. ప్రజల కడుపు నింపితే ప్రజలు హర్షిస్తారన్న లాజిక్ బిజెపి నేతలు మర్చిపోయారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
ఎంతసేపూ తెరాసను విమర్శించడం మానుకోవాలని సూచించారు. ఈడీ, సిబిఐ అని చెప్పడం ప్రచారం చేసుకోవడం తప్ప వారు చేసేదేమీ లేదన్నారు. ఫ్లెక్సీలు చింపే సంస్క్రుతి ఎక్కడిదని, కొత్త పద్ధతి బిజెపి తీసుకొచ్చింది ఆరోపించారు. బిజెపికి దమ్ముంటే కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని సూచించారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అభివృద్ధి కోసం ప్రకటన చేస్తారేమోన ఆశిస్తే మోడీ ఫొటో కోసం రాద్ధాంతం చేశారని ఆరోపించారు.
అభివృద్ధి పక్కన పెట్టి నెగటివ్ ప్రచారానికి బిజెపి తెర లేపిందని ఎమ్మెల్యే విమర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్లు ప్రకటించారని, అందుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమానికి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బైరి శేఖర్ అధ్యక్ష వహించగా, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు బొబ్బిలి నరసయ్య, పాకాల నరసింహులు, నరసింహ చారి, గంగాదాస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.