కామారెడ్డి, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ మండలం మమ్మద్ బాద్లో రూర్బన్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జెయింట్ సెక్రెటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత పరిశీలించారు. 400 మెట్రిక్ టన్నుల గిడ్డంగిని, గోపాలమిత్ర కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు.
గోదాం నిర్మించడం వల్ల కలిగిన ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నీటి తొట్టిని పరిశీలించారు. వేసవికాలంలో నీటి తోట్టి పశువుల దాహార్తిని తీర్చడానికి దోహదపడుతుందని రైతులు తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యాబోధన జరుగుతున్న తీరును పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు.
కేంద్రంలోని పిల్లలకు పౌష్టికాహారం అందే విధంగా చూడాలన్నారు. జుక్కల్‌లో 30 పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠధామాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్‌డిఓ సాయన్న, అధికారులు పాల్గొన్నారు.