నిజామాబాద్, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది బీడి కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులందరికీ చేతినిండా పని లేదని, నెలలో 10 లేక 12 రోజులు పని మాత్రమే లభిస్తుందని, ఈ పరిస్థితులలో 2014 సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికల్లో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పని చేస్తున్న బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేశారు కానీ జీవన భృతి పొందటానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల వల్ల వేలాది మంది బీడీ కార్మికులకు జీవన భృతి అమలు కాలేదని, 28.2.2014 తేదీలోపుగా ఉన్న పిఎఫ్ నెంబర్ గల బీడీ కార్మికులకు ఇవ్వాలనే నిబంధనలను కటప్ తేదీ నిబంధనలను తొలగించాలని ఎలాంటి ఆంక్షలు లేకుండా 2022 సంవత్సరం వరకు బీడీ కార్మికులకులందరికీ, బీడీప్యాకర్స్‌కు, నెలసరి ఉద్యోగులకు, బీడీ కమీషన్ దారులకు, జీవన భృతి అమలు చేయాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్సీ కవితకి, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి బృందం మెమోరండం ఇచ్చి చర్చించారు.
మెమోరండంను స్వీకరించిన ఎమ్మెల్సీ కవిత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డి రాజేశ్వర్, జిల్లా కార్యదర్శి ఎం వెంకటి పాల్గొన్నారు.