పండుగ వాతావరణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు చేపట్టనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అట్టహాసపు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ.ఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఈ నెల 16న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని, మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, పోలీస్‌, రెవెన్యూ, జిల్లా అధికారులతో పాటు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ ర్యాలీని విజయవంతం చేయాలని అన్నారు. ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాలను ప్రదర్శించాలని, ఈ మేరకు ప్రతి సెగ్మెంట్‌కు వేల సాధారణ జాతీయ పతాకాలు, 50 పెద్ద జాతీయ పతాకాలు పంపిస్తామని సిఎస్‌ తెలిపారు.

ర్యాలీగా ఏదైనా విశాలమైన మైదానం కానీ ఆడిటోరియం వంటి ప్రదేశానికి చేరుకొని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తెలంగాణ విమోచనం ప్రాశస్త్యాన్ని వివరించేలా చూడాలన్నారు. సెప్టెంబర్‌ 17న జిల్లా కేంద్రాలలో ముఖ్య అతిథులచే జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని, అదేవిధంగా హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ఆదివాసీ భవన్‌, బంజారా భవన్‌లను ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో 1.2 లక్షల ఎస్టీలు పాల్గోనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సెప్టెంబర్‌ 17న మధ్యాహ్న సమయంలో గిరిజన తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు (గ్రామ వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్‌ పర్సన్‌), ఎస్టీ రైతుబంధు సమితి నాయకులు, ఎస్టీ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, ఎస్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులు హైదరాబాద్‌ చేరుకునేలా భోజన వసతితో కూడిన రవాణా సదుపాయం కల్పించాలని ఆదేశించారు.

18న జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర సమరయోధులను, రచయితలు, కవులు, ప్రముఖ కళాకారులను గుర్తించి సన్మానించాలని, ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని 14 వ తేదీ నుండి ఉత్సవాలు ముగిసేంత వరకు జిల్లాలలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్యాలయాలను మూడు రంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించాలని అన్నారు.

డి.జి.పి. మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవలే పక్షం రోజుల పాటు జరిపిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే ప్రస్తుతం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు కూడా విస్తృత ఏర్పాట్లు చేపట్టి విజయవంతానికి కృషి చేయాలని అన్నారు. ఈ ఉత్సవాల్లోనూ పోలీసు శాఖ పాత్ర క్రియాశీలంగా ఉండేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని, ఇతర శాఖలతో సమన్వయము చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌.ఈ రాజేశ్వర్‌ రెడ్డి, నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, డీపీఓ జయసుధ, డీఈఓ దుర్గా ప్రసాద్‌, ఆర్‌టీసి ఆర్‌.ఎం ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »