Breaking News

బ్యాంకర్ల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట రుణాల పంపిణీలో బ్యాంకర్లు అలసత్వ వైఖరి ప్రదర్శించడం పట్ల కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు. నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనప్పటికీ పంటల సాగు కోసం అవసరమైన రుణాలను రైతాంగానికి పంపిణీ చేయడంలో పలు బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. ఏది ఎంతమాత్రం సమంజసం కాదని, పనితీరు మార్చుకొని పక్షంలో జిల్లా యంత్రాంగం తరపున కఠిన చర్యలకు పూనుకుంటామని స్పష్టం చేశారు.

గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌) లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఒక్కో బ్యాంకు వారీగా పంట రుణాల పంపిణీలో సాధించిన ప్రగతిని కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా పలు బ్యాంకులు రుణాలు అందించడంలో పూర్తిగా వెనుకబడి ఉండడం పట్ల కలెక్టర్‌ ఒకింత అసహనం వ్యక్తపర్చారు.

2022 ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి గత ఆగస్టు నెలాఖరు నాటికి జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా 233377 మంది రైతులకు 2308 కోట్ల రూపాయల మేర పంట రుణాలు అందించాలని లక్ష్యం కాగా, కేవలం 108279 మంది రైతులకు 1162 .10 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే పంపిణి చేశారని, నిర్దేశిత లక్ష్యంలో పంట రుణాల పంపిణీ యాభై శాతానికే పరిమితమైందని అన్నారు.

వ్యవసాయ టర్మ్‌ లోన్లకు సంబంధించి కూడా కేవలం 24.71 శాతం పంపిణీ చేయడం పట్ల కలెక్టర్‌ పెదవి విరిచారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి మూడు వారాల వ్యవధిలో రుణ పంపిణీని మెరుగుపర్చుకోవాలని, అక్టోబర్‌ మొదటి వారంలో తాను మళ్ళీ సమీక్ష జరిపే నాటికి అన్ని బ్యాంకులు తొంభై శాతం మేర పంట రుణాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ గడువు విధించారు.

నిర్ణీత సమయంలో లక్ష్యం సాధించని బ్యాంకుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కరాఖండీగా తేల్చి చెప్పారు. భూముల రికార్డులు అన్నీ సక్రమంగా ఉన్న తరుణంలో పంట రుణాలు అందించేందుకు ఇబ్బందులు ఏమిటని కలెక్టర్‌ ప్రశ్నించారు. రుణ బకాయిల వసూళ్ల విషయంలో జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని, రైతులకు పంట రుణాలు అందించేందుకు బ్యాంకర్లు వెనుకాడవద్దని హితవు పలికారు.

అదేవిధంగా ఐకెపి మహిళా సంఘాలకు లింకేజీ రుణాలను, యువతకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు విరివిగా రుణాలు పంపిణీ చేయాలని, ప్రజల్లో ఆర్ధిక అక్షరాస్యతను పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఎంతో ప్రాధాన్యతతో కూడిన బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి తప్పనిసరిగా ఆయా బ్యాంకుల తరఫున సమన్వయకర్తలు హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు.

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, లీడ్‌ బ్యాంక్‌ ఏజీఎం రాజేంద్ర ప్రసాద్‌, జిల్లా మేనేజర్‌ శ్రీనివాసులు, నాబార్డు ఈజీఎం నాగేష్‌, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌, మెప్మా పీ.డీ రాములు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నాగూరావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, ఏప్రిల్‌.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »