హైదరాబాద్, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ సినీ నటులు రెబెల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు జామున కృష్ణంరాజు మరణించగా, జూబ్లీహిల్స్ లోని వారి నివాసానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేరుకొని కృష్ణంరాజు పార్దీవదేహం పై పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి, ప్రముఖ హీరో ప్రభాస్ ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి ని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు వంటి అనేక గొప్ప చిత్రాలలో నటించి అనేకమంది అభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. 55 సంవత్సరాల తన సినీ రాజకీయ ప్రస్థానంలో 180 కి పైగా చిత్రాలలో నటించారని తెలిపారు. ఇటీవల వచ్చిన రాదేశ్యామ్ ప్యాన్ ఇండియా చిత్రంలో కూడా నటించారని అన్నారు.
అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే మంచి వ్యక్తిగా పెరు సంపాదించుకున్నారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ప్రభాస్ గొప్ప నటుడిగా రాణించడం పట్ల కృష్ణంరాజు ఎప్పుడు ఎంతో గర్వంగా పీలయ్యే వారని చెప్పారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు అన్నారు.