నిజామాబాద్, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికుల జీవనభృతికై 2014 జూన్ కటాఫ్ తేదీని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ… బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయుటకు అడ్డంకిగా వున్న (2014 జూన్) కటాఫ్ తేదీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) పోరాట విజయమన్నారు.
యూనియన్ ఆధ్వర్యంలో 2014 నుండి రూ. 1000 జీవన భృతి అమలకై, ఆ తర్వాత రూ. 2016 జీవనభృతికై, ఆ తర్వాత అర్హులైన వారందరికీ జీవనభృతి ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిరసనలు, సదస్సులు నిర్వహించామన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ద్వారా, ఎమ్మెల్సీ కవిత ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్‌కి విన్నవించామన్నారు.
ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే కట్ ఆఫ్ తేదీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇది యూనియన్ నాయకత్వంలో బీడీ కార్మికులు సాధించిన పోరాట విజయమన్నారు. కార్మికుల హక్కుల కోసం, వారి ప్రయోజనాల కోసం రాజీలేని పోరు చేస్తున్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) లో చేరి యూనియన్‌ను మరింత బలోపేతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
పిఎఫ్ ఉండి, జీవనభృతి రాని బీడీ కార్మికులందరూ జీవనభృతికై దరఖాస్తు చేసుకోవాలని బీడీ కార్మికులను కోరారు. ప్రెస్ మీట్‌లో యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.నరేందర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం. వెంకన్న, నాయకులు ఎం.ముత్తన్న. బి.మల్లేష్, డి.కిషన్, సత్యక్క, లాలయ్య, జమున, ఇంతియాజ్, సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.