న్యూ కలెక్టరేట్‌లో ప్రజావాణికి విశేష స్పందన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం న్యూ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. న్యూ కలెక్టరేట్‌లో మొట్టమొదటి కార్యక్రమం అయినప్పటికీ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలపై అర్జీలు సమర్పించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

వివిధ సమస్యలను నివేదిస్తూ ప్రజల నుండి మొత్తం 59 వినతులు వచ్చాయి. వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను వెంటదివెంట పరిశీలిస్తూ, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యల గురించి అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని, ఆన్‌లైన్‌ సైట్‌లోనూ వివరాలు అప్లోడ్‌ చేయాలని సూచించారు.

పెండిరగ్‌ ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శనం, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

అన్ని కార్యాలయాలు సమీకృత సముదాయంలోకి మారాల్సిందే : కలెక్టర్‌
కాగా, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలను సమీకృత సముదాయ భవనం (న్యూ కలెక్టరేట్‌) లోకి తక్షణమే మార్చుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, సుమారు నలభై శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాల కోసం సమీకృత భవన సముదాయంలో అధునాతన సదుపాయాలతో కూడిన గదులు కేటాయించడం జరిగిందన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఇంకనూ ఎవరైనా ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ లోకి తమ కార్యాలయాలను మార్చుకోనట్లయితే వెంటనే షిఫ్ట్‌ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల పాలనాపరమైన సౌలభ్యంతో పాటు ప్రజలకు కూడా ఒకేచోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చినట్లవుతుందని, ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందని పేర్కొన్నారు. ఆయా కార్యాలయాలకు కొత్త ఫర్నీచర్‌ కొనుగోలుకై సుమారు రెండున్నర కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్‌ తెలిపారు. ఆలోపు అందుబాటులో ఉన్న ఫర్నీచర్‌ను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

సమయ పాలన పాటిస్తూ… క్రమశిక్షణతో మెలగాలి

కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ఎవరైనా ఇష్టారీతిన వ్యవహరిస్తే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.

ప్రతి శాఖకు సంబంధించిన కార్యాలయం, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, తనతో పాటు అదనపు కలెక్టర్లు ఆయా శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారని తెలిపారు. కలెక్టరేట్లో విధులు నిర్వర్తించే వారందరికీ పాసులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్‌ ఏ.ఓ ను ఆదేశించారు. పాసులు ఉన్న వారినే లోనికి అనుమతించాలని, ఉద్యోగులు ఎక్కడబడితే అక్కడ కారిడార్లలో తచ్చాడకుండా తమతమ కార్యాలయాల్లో విధుల్లో నిమగ్నమై ఉండాలని హితవు పలికారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »