నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను నిజామాబాద్ జిల్లా ఎక్కువ సంఖ్యలో సాధించేలా ఆయా శాఖల అధికారులు సమిష్టిగా, పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 9 అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అందించే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుల కోసం అర్హత కలిగిన అన్ని జీ.పీలు దరఖాస్తు చేసేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఆయా పథకాలు, వివిధ కార్యక్రమాల కింద అనేక పనులు చేపట్టినందున సమగ్ర వివరాలతో అవార్డుల కోసం కృషి చేయాలన్నారు. చేసిన పనులను పూర్తిస్థాయిలో ప్రదర్శితం అయ్యేలా నిర్ణీత నమూనాలో వివరాలు అందించాలన్నారు.
వివరాల సేకరణ విషయంలో ఆయా శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరం అన్నారు. ఏదైనా అంశంలో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. ఎంపీడీవోలు ఈ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించాలని, ఎంపీడీవోలు కోరిన సమాచారాన్ని అందించేందుకు అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. ఇదివరకటి తరహాలోనే జిల్లాకు జాతీయ స్థాయిలో అత్యధిక స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు దక్కడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.
ఇదిలావుండగా, గర్భిణీ మహిళలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్యారోగ్య, ఐసీడీఎస్ శాఖలు సమన్వయం పెంపొందించుకోవాలని, గ్రామ కార్యదర్శి, ఆశా వర్కర్, అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎంలు కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. గర్భిణీల వివరాల నమోదు తప్పనిసరి చేయాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో 0 – 6 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులందరి ఎత్తు, బరువును పరిశీలించేలా ఏర్పాట్లు చేయాలని, సోమవారంలోగా సంబంధిత పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి అందుకు గల కారణాలను తెలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితి చక్కదిద్దేందుకు కృషి చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు. హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, పిచ్చి మొక్కలను శుభ్రం చేయించాలన్నారు. రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ గాడి తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
బస్తీ దవాఖానాల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో నూటికి నూరు శాతం లక్ష్యం సాధించాలన్నారు. ఈ నెల 15న ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికీ విధిగా నట్టల నివారణకై అల్బెన్ డజోల్ మాత్రలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్‌డీఓ చందర్, డీపీఓ జయసుధ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.