నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం కంజర గ్రామంలో గల ప్రభుత్వ సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, మోపాల్ లోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కంజర రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్, అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు.
కిచెన్, డార్మెటరీ, స్టోర్ రూమ్, టాయిలెట్స్ వద్ద గల వసతులను స్వయంగా పరిశీలన జరిపారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాన్న భోజనాన్ని తనిఖీ చేశారు. స్టోర్ రూంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పు దినుసులు, వంట నూనె ఇత్యాది సరుకుల నాణ్యతను పరిశీలించారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో పలువురు బాలికలు డార్మెటరీలో విశ్రాంతి తీసుకోవడాన్ని గమనించిన కలెక్టర్, వారి ఆరోగ్య స్థితిగతులు, అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
నాణ్యమైన వైద్యం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ లను సందర్శించి విద్యార్థినులను పలుకరించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యాబోధన గురించి కూడా విద్యార్థినులను ఆరా తీసిన కలెక్టర్, చక్కగా చదువుకోవాలని హితవు పలికారు.
విద్యను ఆయుధంగా మల్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బాలికల్లో స్ఫూర్తి నింపారు. విద్యార్ధి దశలో కష్టపడితే జీవితాంతం సుఖపడవచ్చని, కుటుంబ తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని సమయం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, సెల్ ఫోన్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రెసిడెన్షియల్ పాఠశాల తరగతి గదులు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండడం, నిర్వహణ సక్రమంగా ఉండడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, మోపాల్ బీ.సీ బాలుర వసతి గృహం సందర్శించిన సందర్భంగా, అనేక లోపాలు కనిపించడంతో కలెక్టర్ సంబంధిత అధికారుల పనితీరును ఆక్షేపించారు. హాస్టల్ పరిసరాల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు.
అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొని ఉంటే అనారోగ్యాలు ప్రబలడంతో పాటు విష పురుగులు సంచరించే ప్రమాదం ఉన్నందున తక్షణమే పరిసరాల శుభ్రతపై దృష్టి సారించాలన్నారు. పది రోజుల్లో తాను మళ్ళీ వసతి గృహాన్ని తనిఖీ చేస్తానని, ఆలోపు పరిస్థితులు చక్కదిద్దకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. హాస్టల్‌లో కొనసాగుతున్న మరమ్మతు పనులను నిర్ణీత గడువులోగా, నాణ్యతతో పూర్తి చేయించాలని సూచించారు. కలెక్టర్ వెంట బీ.సీ సంక్షేమ అధికారి నర్సయ్య, కంజర రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవీలత, మోపాల్ ఎం.పీ.ఓ ఇక్బాల్ తదితరులు ఉన్నారు.