నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) నగర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం నగరంలోని కోటగల్లి, ఎన్‌ఆర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, పి.డి.ఎస్.యు మాజీ జిల్లా కార్యదర్శి కొంగర శ్రీనివాస్ రావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు.
జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాదానికి వ్యతిరేకంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలన్నారు. విద్యార్థి ఉద్యమ గమనంలో ఎంతోమంది విద్యార్థి నాయకులు అమరులయ్యారన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యారంగం వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ ఉద్యమించాలన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ నిధులలేమి, ఖాళీ పోస్టులతో అవస్థలు పడుతుందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యా కాషాయీకరణకు కుట్రలు చేస్తుందన్నారు. విద్యార్థులను మూఢ భక్తులుగా తయారుచేసే ప్రయత్నాలు వేగిరం చేసిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా ప్రవేటీకరణ కాషాయీకరణ విధానాలను విద్యార్థులే ప్రతిఘటించాలన్నారు.
విద్యార్థులు శాస్త్రీయ భావజాలాన్ని అలవర్చుకోవాలన్నారు. దోపిడీ పీడనలు, కులమత బేధాలు లేని భారత్ ను నిర్మించాలన్నారు. కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్పన, నరేందర్ తె.యూ కన్వీనర్ గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు అషూర్, జిల్లా నాయకులు మహిపాల్, నవీన్, అఖిల, నాయకులు గమ్య, తిరుమలేష్, తరుణ్ మనీషా, కావేరి, జ్యోతి, చరణ్ సాకేత్, గంగా ప్రసాద్, నవీన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.