నిజామాబాద్, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, తెలంగాణా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని, ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు సైతం జారీ చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల వారీగా16న జరిగే ర్యాలీ, సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ పక్క ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయాలని సూచించారు.
వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 14 నుండి 18 వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని అన్నారు. ఈనెల 17న జిల్లా, మండల, గ్రామపంచాయతీల స్థాయిలో అన్నిప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. అదే రోజున హైదరాబాద్‌లో జరిగే ఆదివాసీ, బంజారా భవన్ ల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున గిరిజనులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగ వాతావరణంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తదనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని డిజిపి మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.
ఇదిలా ఉండగా, వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులకు ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. 16 న నియోజకవర్గ కేంద్రాల్లో 15 వేల మందితో నిర్వహించే ర్యాలీ సందర్భంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ర్యాలీ వెంట రెండు అంబులెన్సు లు, వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రవాణా వ్యవస్థ, తాగునీటి వసతి, భోజన సదుపాయాలు, బహిరంగ సభ తదితర పనులను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో చక్కబెట్టుకోవాలని, ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ చిత్రామిశ్రా, డీఆర్‌డీఓ చందర్, డీటీసీ వెంకట రమణ, డీపీవో జయసుధ, డీఐఈఓ రఘురాజ్,ఆర్‌అండ్‌బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, అదనపు డీసీపీ గిరిరాజ్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.