కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు రోజులపాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సి ఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సులో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఈనెల 16, 17,18 తేదీలలో ఉత్సవాలను జరపాలని సూచించారు. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులు, మహిళలతో ర్యాలీలో నిర్వహించాలని పేర్కొన్నారు.
17న జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాలను ఎగురవేస్తారని చెప్పారు. గ్రామపంచాయతీలు, మండల, పురపాలక సంఘాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జెండాలు ఎగురవేయాలని పేర్కొన్నారు. 18న కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
మూడు రోజులపాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. 16న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు తీయడానికి ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు తమ వంతు సహకారం అందించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పి సీఈవో సాయగౌడ్, ఆర్టీవో వాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.