కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17న హైదరాబాదులో నిర్వహించే ఆదివాసీ గిరిజన సమ్మేళనం కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న హైదరాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొమరం భీమ్ ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని, సదరు కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రత్యేకించిన బస్సులలో ఎస్టీ ఉద్యోగస్థులు, ప్రజాప్రతినిధులు, సభ్యులను, ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు వెళ్లనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో నిర్మించిన కొమరం భీమ్ ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో ఎస్టీ ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డిపిఎం రవీందర్ పాల్గొన్నారు.