కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు మాత్రలు వేసి నులిపురుగులు రాకుండా సులభంగా నియంత్రించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గంజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా గురువారం మాత్రలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.0-19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తప్పనిసరిగా నివారణ మాత్రలు వేసుకునే విధంగా ఆరోగ్య, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు చూడాలన్నారు. పోషకార లోపం, రక్తహీనతలతో విద్యార్థులు ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. ఆరు నెలలకు ఒకసారి ప్రతి సంవత్సరం రెండుసార్లు మాత్రలు వేయాలని కోరారు.
విద్యార్థులు అనారోగ్యంతో ఉండవద్దని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిని సారించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మండల విద్యాధికారి ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, ఆరోగ్య, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.