నందిపేట్, సెప్టెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్న ఊర పందుల నిర్మూలన కొరకు సోమవారం చర్యలు చేపట్టారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఒత్తిడి మేరకు సోమవారం గ్రామంలో గల పందులను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించారు.
విడిసి, గ్రామ పంచాయితీ ఎన్నిసార్లు మందలించిన పందుల పెంపకం దారులు పెడచెవిన పెట్టడంతో సోమవారం విడిసి ఆధ్వర్యంలో ఇతర మండలం నుండి పందులను పట్టే వారిని పిలిపించి గ్రామంలో తిరుగుతూ పందులను పట్టించారు. గ్రామ పరిశుభ్రతను నష్టపరిచి, ప్రజలు రోగాల బారిన పడటానికి కారణం అవుతున్న పందులను తొలగించాలని కోరుతూ గతంలో విడిసి పెద్ద ఎత్తున ధర్నా, రస్తారొఖో చేసి జిల్లా అధికారులకు నిరసన తెలపడంతో అప్పటి హామీ మేరకు అధికారులు సోమవారం పందుల ఏరివేత కార్యక్రమం చేపట్టారు.
ఊరవతల షెడ్లలో పెంచకుండా, ఊరిలో విచ్చలవిడిగా వదిలిపెడుతూ ఉచిత లాభాలను గడిస్తున్న పెంపకం దారులపై గ్రామపంచాయతీ జరిమానాలు విధించాలని పలువురు కోరుతున్నారు. గ్రామప్రజల వ్యాధులకు అపరిశుభ్రతకు కారణం అవుతున్న పందులు గ్రామ పరిసర ప్రాంతాల రైతుల పంటలను కూడ నష్ట పరుస్తున్నాయి. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం కొరకు విడీసీ నడుం బిగించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. కార్యక్రమంలో విడిసి అధ్యక్షుడు పెద్దకాపు సుమన్, ఉపసర్పంచ్ భరత్, పంచాయతీ కార్యదర్శి సౌమ్య, గ్రామ యువకులు పాల్గొన్నారు.