కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుభ్రపరిచిన దాన్యంను కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుక వచ్చే విధంగా సహకార సంఘ చైర్మన్లు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం వానకాలంలో ధాన్యం కొనుగోళ్లపై సహకార సంఘం అధ్యక్షులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్స ఉపయోగించాలని సూచించారు. టార్పాలిన్ కవర్లను, గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచాలని కోరారు. వరి కోత మిషన్లు ఉన్న వారి వివరాలు గ్రామాల వారీగా సేకరించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వారిగా లారీలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 6000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
వే బ్రిడ్జిలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని పేర్కొన్నారు. తమకు రావలసిన కమిషన్ను ఇప్పించాలని సహకార సంఘాల చైర్మన్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్టీవో వాణి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ జితేంద్రప్రసాద్, ఇన్చార్జి సివిల్ సప్లై అధికారి రాజశేఖర్, జిల్లా సహకార అధికారిని వసంత, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, సహకార సంఘాల చైర్మన్లు నల్లవెల్లి అశోక్, మర్రి సదాశివరెడ్డి, సాయికుమార్, కిష్టా గౌడ్, నరసింహులు పాల్గొన్నారు.