నిజామాబాద్, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి కలెక్టర్ మంగళవారం సారంగపూర్, జానకంపేట్, పోచారం, ఎడపల్లి, బోధన్, మినార్ పల్లి, ఎడపల్లి, బోధన్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అక్కడక్కడా లోపాలను గమనించిన కలెక్టర్, తక్షణమే వాటిని సవరించాలని అధికారులకు సూచించారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించకుండా విరివిగా మొక్కలు నాటాలని, రోడ్డుకు రెండువైపులా పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడేలా అంకిత భావంతో కృషి చేయాలన్నారు.
ట్రీగార్డులు, కర్రలను సరి చేసుకుంటూ, ధ్వంసమైన, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా ఎతైనా మొక్కలు నాటించాలని ఆదేశించారు. మొక్కల చుట్టూ సాసరింగ్ చేస్తూ, పిచ్చి మొక్కలు, గడ్డి లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అటవీ శాఖ, ఉపాధి హామీ తదితర శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, రహదారులకు ఇరువైపులా పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. వారం లోపు లోపాలను సరిచేసుకుంటూ మొక్కల నిర్వహణను గాడినపెట్టాలని, వచ్చే వారం మళ్ళీ తాను పరిశీలనకు వస్తానని పేర్కొన్నారు.
అప్పటికి కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రోడ్డు మధ్యన మీడియన్ ప్రదేశంలో అందమైన పూల మొక్కలతో ఆకట్టుకునే రీతిలో పచ్చదనం సంతరించుకునేలా పనులు జరిపించాలని అన్నారు. ఇప్పటికే నాటిన కోనాకార్పస్ మొక్కలను డోమ్ ఆకారంలో క్రమపద్ధతిలో పెరిగేలా చూడాలన్నారు. హరితహారం నిర్వహణ పనుల కోసం అవసరమైతే ఉపాధి హామీ కూలీలను సమకూర్చడంతో పాటు ఇతరత్రా సహకారాన్ని కూడా జిల్లా యంత్రాంగం తరపున అందిస్తామని అన్నారు.
కాగా, రహదారులకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన మొక్కలు పశువుల కారణంగా ధ్వంసమవుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణకు ప్రజలు తప్పనిసరిగా తోడ్పాటును అందించాలని కోరారు. ప్రభుత్వం హరితహారంకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెరగడం వల్ల వర్షాలు అనుకూలిస్తున్నాయని పేర్కొన్నారు.
కాగా, మార్గమధ్యంలో గల ఎడపల్లి లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాల పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి ఉన్నందున తక్షణమే ఉపాధి హామీ కూలీలచే శుభ్రం చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలను కూడా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అన్నారు.
కలెక్టర్ వెంట బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, జెడ్పి వైస్ చైర్‌పర్సన్ రజితా యాదవ్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, ఆయా మండలాల అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు.