నిజామాబాద్, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, కార్య దీక్షా పరుడు, గొప్ప ఉద్యమ నేత, బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్థంతి సందర్బంగా బాపూజీ చిత్రపటానికి బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
శాసనసభ్యుడిగా, శాసనసభ ఉపనేతగా, మంత్రిగా, రాష్ట్రానికి ఎన్నో సేవలందించి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ వచ్చిన తర్వాతనే పదవులు తీసుకుంటానని శపథం చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. తొంభై ఏళ్ల వయసులో కూడా విశ్రాంతి తీసుకోకుండా బస్సు యాత్ర చేసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పిన గొప్ప నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్రోద్యమంలో కానీ తెలంగాణ తొలి ఉద్యమంలో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాలు పంచుకుని ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తన ఇంటిని తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లుగా మార్చి ఎందరికో వేదికగా తన ఇంటిని మార్చిన గొప్ప మార్గదర్శి కొండాలక్ష్మణ్ బాపూజీ అన్నారు. కార్యక్రమంలో దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కోడూరి పోశెట్టి, అనిల్, దండు శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.