నిజామాబాద్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు ఉపయుక్తంగా నిలిచేలా మీ సేవా కేంద్రాలు హెల్ప్‌లైన్ సెంటర్లుగా సేవలందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ధరణి కార్యక్రమం పై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ సమస్యల విషయంలో రైతులచే సరైన విధంగా ధరణిలో దరఖాస్తులు చేయించడంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మీ సేవా కేంద్రాల ఆపరేటర్లకు ధరణికి సంబంధించిన అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
డివిజన్ల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించాలని, మీ సేవ కేంద్రాలు హెల్ప్‌లైన్ సెంటర్లుగా ఉపయోగపడేలా చూడాలన్నారు. అలాగే, భూ సమస్యల పరిష్కారం కోసం కనీసం ఐదు వారాల పాటు మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రత్యేకంగా భూ సంబంధిత సమస్యలపైనే ప్రజావాణి నిర్వహించాలని సూచించారు.
తహసీల్దారుతో పాటు ఆర్ఐ, సర్వేయర్ తప్పనిసరిగా ప్రజావాణిలో అందుబాటులో ఉండాలని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు పట్టా పాస్ బుక్ రావాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.