కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను బతుకమ్మ పండగ చాటి చెప్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
బతుకమ్మ పండుగను ఘనంగా జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక సమైక్యతకు ఈ పండుగ దోహదపడుతుందని తెలిపారు. పూలనే దేవతగా మహిళలు భావించి పూజిస్తారని పేర్కొన్నారు.
మహిళలతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆటాడారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా సంక్షేమ అధికారి రమ్య, సిడిపివోలు శ్రీలత, సునంద, పద్మ, అధికారులు సాయికుమార్, కాజా పాషా, అశోక్, నరేష్, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, అంగన్వాడి కార్యకర్తలు, వ్యాఖ్యాత మనోహర్, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.