నిజామాబాద్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం టీఎన్‌జీఓల సంఘం ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు.
జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, మహిళా కమిషన్ సభ్యురాలు సుదాం లక్ష్మీ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు వేడుకల్లో పాల్గొని కోలాటం ఆడుతూ మహిళలను ఉత్సాహపర్చారు. ముందుగా రంగురంగుల పూలతో ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేసిన బతుకమ్మలకు జెడ్పి చైర్మన్, కలెక్టర్ తదితరులు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
అనంతరం బతుకమ్మ సంబరాల్లో తాము కూడా స్వయంగా భాగస్వాములవుతూ కోలాటం ఆడారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు తమ ఆటపాటలతో అందరిలో హుషారు నింపారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి.
బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయ పనివేళలు ముగిసినప్పటికీ ఉద్యోగినులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఎంతో హుషారుగా ఈ ఉత్సవంలో పాల్గొని బతుకమ్మ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు.
దాదాపు మూడు గంటలకు పైగా విరామం లేకుండా సాగిన ఈ సంబరాల్లో అలుపెరుగకుండా మహిళలు బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగనున్న బతుకమ్మ వేడుకలను ఇదే రీతిలో మరింత పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం పట్ల ప్రతినిధులను అభినందించారు. ఉత్సవాల్లో టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, అమృత్ కుమార్, శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, డీఎంహెచ్‌ఓ సుదర్శనం, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డీఎస్‌సిడీఓ శశికళ, డీడబ్ల్యుఓ సౌందర్య, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.