కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, కల్వరాల గ్రామంలో మొక్కజొన్న పంట పొలాల క్షేత్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్తలు సందర్శించారు.
కార్యక్రమంలో డాక్టర్ కే. నగేష్, మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ మల్లయ్య, వ్యాధి నిర్ధారణ విభాగం శాస్త్రవేత్త అలాగే కరీంనగర్ మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్.శ్రావణి, డాక్టర్. రాజేంద్రప్రసాద్, పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్. ఓం ప్రకాష్, నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. నవీన్ కుమార్, కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మి, ఎల్లారెడ్డి డివిజన్ ఏడిఏ రత్నతో స్థానిక గాంధారి మండలం వ్యవసాయ అధికారి నరేష్, సదాశివ్ నగర్ మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో ఈ సందర్శనను నిర్వహించారు.
క్షేత్ర సందర్శనలో భాగంగా మొక్కజొన్న పంట ప్రస్తుత వానాకాలంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను రైతులు శాస్త్రవేత్తల దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని మొక్కజొన్న పంట క్షేత్రాలలో మొక్కజొన్న కండలు సరిగా రాకపోవడం అలాగే మిగతా చోట మొక్కజొన్న మొలకెత్తిన తర్వాత కంకులు కూడా ఏర్పడకపోవడం వంటి అంశాలను పరిశీలించారు.
మొక్కజొన్నలో చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులను అలాగే ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం గురించి ప్రధాన శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కూలంకషంగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు గాంధారి మండలానికి సంబంధించి సోమారం గ్రామంలో, సదాశివ నగర్ మండలంలోని కల్వరాల గ్రామలను సందర్శించారు.
అధిక వర్షాలు పడినప్పుడు మొక్కజొన్న పంటల్లో చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు మొక్కజొన్న ఎదగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అధిక దిగుబడిని పొందడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కరుణాకర్, సదాశివనగర్ మండలం వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు గ్రామ రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు, రైతు బంధు సమితి సభ్యులు, మొక్కజొన్న విత్తనాన్ని సరఫరా చేసినటువంటి డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.