నిజామాబాద్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయో వృద్ధుల అనుభవాలు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని జడ్పి చైర్మన్ దాదాన్నగారి విట్ఠల్ రావు అభిప్రాయపడ్డారు. నగరంలోని న్యూ అంబెడ్కర్ భవన్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పి చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సుధాం లక్ష్మీ , నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టరు చంద్రశేఖర్, ఆర్డీవో రవి తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ దాదాన్న గారి విట్ఠల్ రావు మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలకు దారి చూపే మార్గదర్శకులని అన్నారు. వయోవృద్ధుల అనుభవాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. వయో వృద్ధులకు రైల్వే రవాణాలో 40శాతం రాయితీ ఇప్పించేలా చూస్తానని అన్నారు. అలాగే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ను సంప్రదించి ఆర్టీసీలో వయో వృద్ధులకు రాయితీ అమలయ్యేలా చొరవ చూపుతానని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80 లక్షలతో డిచ్‌పల్లి మండలం రాంపూర్‌లో వృద్దుల కోసం ప్రత్యేకంగా ఓల్డ్ ఏజ్ హోమ్ నెలకొల్పుతోందని, ఈ వృద్ధాశ్రమం పనులు వేగంగానే జరుగుతున్నాయని వివరించారు. మొదటి దశలో 50 లక్షలు, రెండవ దశలో 30 లక్షలతో పనులు పూర్తి కానున్నాయని వివరించారు. కాగా, పిల్లలకు చిన్ననాటి నుండే నైతిక విలువలు నేర్పిస్తే, వృద్ధ ఆశ్రమాల అవసరం ఉండదని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు.
భారతీయ సంసృతి ఎంతో ఉన్నతమైనదని, మన దేశంలో బంధాలు, బంధుత్వాలకు అనాది నుండి ఎంతో విలువ ఉందన్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత సమాజంలో కొంత మంది కుటుంబ పోషణను భారంగా భావిస్తూ, తల్లిదండ్రులలకు సమయం ఇవ్వలేని పరిస్థితులు, కలిసి భోజనం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను దేవుళ్ళుగా భావిస్తూ వారి పట్ల ఆదరాభిమానాలు కనబర్చే ధన్య జీవులని అన్నారు. రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు సుధాం లక్ష్మీ మాట్లాడుతూ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఎక్కడో అమెరికాలో ఉన్న కొడుకులు, కుమార్తెలు ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యర్థమే అన్నారు. అలాంటి వారు తమకు కూడా ముదిమి వయసులో ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం మర్చిపోకూడదన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రిటైర్డ్ అయ్యి పని చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు వయోవృద్ధులు కాదని, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి బాగోగులను విస్మరించే యువకులు వయోవృద్ధులని అన్నారు. ఎవరైనా తమ పిల్లలకు ఆస్తులు పంచి ఇవ్వాలనుకున్నపుడు ఆస్తిలోనుంచి కొంత భాగం సొంత అవసరాలకు అట్టిపెట్టుకోవాలని హితవు పలికారు. ఆస్తులు లేని వారిని వారి పిల్లలు చూసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, అలాంటి వృద్ధులకు చట్టం తోడుగా ఉంటుందని సూచించారు.
పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్‌లలో పిల్లలు కథలు వినే పరిస్థితి వచ్చిందని, ఏ ఇంట్లో అయితే తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ ఉండరో ఆ కుటుంబం అస్తవ్యస్తంగా ఉంటుందని, కష్టాలు వచ్చినపుడు పరిష్కారం చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారని నేటి సమాజ పరిస్థితి గురించి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వయోవృద్దులను సన్మానించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రవి, డీడబ్ల్యూఓ సౌందర్య తదితరులు పాల్గొన్నారు.