కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమార్లదేనిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ భవనంలో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలని సూచించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పారు. వయో వృద్ధులకు తగిన గౌరవం ఇవ్వాలన్నారు. సమాజంలో సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించవలసిన అవసరం ఉందన్నారు. వృద్ధులను పోషించని వారి కుమారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధులను పోషించే విధంగా సీనియర్ సిటిజన్ ప్రతినిధులు సేవలందిస్తున్నారని తెలిపారు.
సీనియర్ సిటిజన్ ప్రతినిధులు సమాజ సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. 70 ఏండ్లు దాటిన వృద్ధులు ప్రతిరోజు నడక, క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతోందని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు కేటాయించిన ప్రత్యేక సీట్లలో ఇతరులు కూర్చోకుండా చర్యలు చేపట్టే విధంగా ఆర్టీసీ అధికారులతో చర్చిస్తానని తెలిపారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు సన్మానం చేసి బహుమతులను ప్రధానం చేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు విట్టల్ రావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, రిటైర్డ్ ఉద్యోగులు భద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, కౌన్సిలర్లు లత, అపర్ణ, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిని రమ్య, జిల్లా బాలల సంరక్షణ అధికారిని స్రవంతి, అధికారులు పాల్గొన్నారు.