కామారెడ్డి, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తా నగరంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా భారత జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచే విధంగా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని అహింస, సత్యం ధర్మాన్ని కలిగి ఉండాలని వాటితోనే భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ అని, అవమానపరిచే విధంగా చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశానికే కాకుండా బాపూజీ అనుసరించిన మార్గాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు ఉన్నత విద్యలో ఎన్నో రకాలైన పరిశోధనలు చేయడం జరిగిందని అటువంటి గొప్ప వ్యక్తిపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు సరికాదాన్నారు.
ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐవిఎఫ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ భాస్కర్ గుప్తా, కోశాధికారి వలిబిశెట్టి లక్ష్మీరాజ్యం గుప్తా, ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు.