కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందడం సులభం అవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10/10 గ్రేడు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికాలు, ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
విశ్రాంతి ఉద్యోగ సంఘం ప్రతినిధులు ధర్మనిధి ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు నగదు పారితోషికాలు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. పారితోషికం పొందిన విద్యార్థులు నగదును పుస్తకాల కొనుగోలుకు వినియోగించాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సహంతో బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైంది అన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతతో కూడిన విద్య ఉన్నత స్థాయికి మార్గాలని సూచించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గంలో 25 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించి నగదు పురస్కారాలకు ఎంపికైన వారిని అభినందించారు. విద్యార్థులు తమకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు.
జిల్లా పరీక్షల విభాగం సహాయ కమిషనర్ నీలి లింగం మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. మౌలిక వసతులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. 25 మంది విద్యార్థులకు మూడు వేల రూపాయల చొప్పున నగదును అందజేశారు.
సమావేశంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిట్టు విఠల్ రావు, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గౌడ్, కోశాధికారి మల్లేశం, ప్రతినిధులు ఉపేందర్, శ్యామ్ రావు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.