కామారెడ్డి, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా గ్రంధాలయంలో మంగళవారం కెనరా బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కెనరా బ్యాంక్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు సామాజిక సేవలు అందించడంలో ముందంజలో ఉందని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికా వద్దన్నారు. వాకింగ్, ధ్యానం, యోగా చేయాలని సూచించారు. జిల్లా గ్రంధాలయానికి కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.3,28,900 ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని కొనియాడారు.
ఈ నిధులతో గ్రంథాలయంలో కావలసిన ఫర్నిచర్ ను సమకూర్చారని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన దృష్ట్యా యువతి, యువకులు గ్రంథాలయంను ఉపయోగించుకోవడానికి ఈ కార్యక్రమం దోహద పడుతుందని పేర్కొన్నారు.
ఉద్యోగాలు సాధించి యువతీ, యువకులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి మాట్లాడారు. గ్రంథాలయంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ప్రణాళిక బద్ధంగా చదివి ఉద్యోగాలను సొంతం చేసుకోవాలని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, కెనరా బ్యాంక్ రీజినల్ హెడ్ శ్రీనివాసరావు, ఎల్డిఎం చిందం రమేష్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.