నిజామాబాద్, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య కొంతవరకు పెరిగినప్పటికీ, మరింత గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలివెళ్లకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వాసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలన్నారు.
మంగళవారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఏ.ఎన్.ఎంలు మాట్లాడుతూ, తాము గర్భిణీలను ప్రసవాల కోసం ఫ్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పిస్తే, కొంతమంది కాన్పు జరగకముందే ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లకు వెళ్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, ప్రభుత్వాసుపత్రిలో చేరిన గర్భిణీలు అర్ధాంతరంగా ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్ళిపోతే అందుకు గల కారణాలను సమగ్ర విచారణ ద్వారా నిగ్గు తేల్చాలన్నారు.
ప్రభుత్వాసుపత్రికి చెందిన వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్‌కు వెళ్లినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల్లో సంతృప్తికరంగా వైద్యసేవలు అందిస్తే, కాన్పుల కోసం స్వచ్చందంగా ముందుకు వస్తారని అన్నారు. జిల్లాలో సగటున 54 శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానాలలో జరుగుతున్నాయని, మొత్తానికి మొత్తంగా ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా క్షేత్రస్థాయి నుండి సమన్వయంతో కృషి చేయాలన్నారు.
ముఖ్యంగా గర్భిణీల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వారికి మరింత మెరుగైన సేవలందేలా చూడాలన్నారు. దీనివల్ల అనవసర సిజీరియన్ బారి నుండి వారిని కాపాడినట్లు అవుతుందని, ఫ్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లోనూ నమ్మకం పెంపొందించిన వారవుతారని హితవు పలికారు. క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సి వైద్యులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలన్నారు.
గర్భిణీలకు సంబంధించిన వివరాలను ప్రారంభ దశ నుండే తప్పనిసరిగా నమోదు చేయాలని, కేసీఆర్ కిట్ పోర్టల్ లోనూ నమోదు చేయాలన్నారు. పదేపదే చెబుతున్నప్పటికీ పలువురు పనితీరును మార్చుకోవడం లేదని, అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రసవాల విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలను అమలు చేయనుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇమ్యూనైజేషన్, బ్లడ్ శాంపిల్స్ సేకరణ, టెలీ మెడిసిన్, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
టీ.బీ నిర్ధారణ కోసం ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్ సేకరించాలని, ప్రతి ఆశా కార్యకర్త నెలలో కనీసం 10 శాంపిల్స్ పంపించేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజనా, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారి అశోక్, ఇంచార్జి డీడబ్ల్యుఓ సౌందర్య, నిజామాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.