నిజామాబాద్, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతు ఏ దశలోనూ ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. తరుగు, కడ్తా పేరుతో రైతులు నష్టపోకుండా పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులు, సొసైటీల చైర్మన్లు, సీఈఓ లదేనని స్పష్టం చేశారు.
గత ఏడాదితో పోలిస్తే, జిల్లాలో ఈసారి ఖరీఫ్ లో సుమారు 30 వేల ఎకరాల వరకు అధిక విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారని అన్నారు. గతేడాది 3 .90 లక్షల ఎకరాల్లో వరి పండిరచగా, ఈసారి 4 . 18 లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగినందున పెద్ద ఎత్తున దిగుబడులు వస్తాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ధాన్యం సేకరించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు అవసరమైన గోడౌన్లు, స్థలాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈసారి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ధాన్యానికి మంచి డిమాండ్ ఉందని, క్వింటాలుకు రూ.1900 వరకు ధర లభిస్తుందన్నారు. ఈ నేపధ్యంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే ప్రైవేట్ వ్యాపారులను సైతం ప్రోత్సహించాలని, వారికి ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రైతులకు సరైన మద్దతు ధర లభించి వారు లాభపడేలా ప్రతి ఒక్కరు నిజాయితీగా పనిచేస్తూ తమ విధులకు న్యాయం చేయాలని హితవు పలికారు. నాణ్యతా ప్రమాణాలను సాకుగా చేసుకుని రైతులను నష్టపర్చే ప్రయత్నాలను ఎంతమాత్రం ఉపేక్షించకూడదని, రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమైనందున ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని కలెక్టర్ తేల్చి చెప్పారు. తమకు తెలియకుండానే కడ్తా పెట్టారంటూ ఏ ఒక్క రైతు నుండి కూడా ఫిర్యాదు రాకూడదని అన్నారు.
నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను సమకూరుస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా ధాన్యం లోడిరగ్, అన్‌లోడిరగ్‌లో జాప్యం జరుగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే చాలా వరకు సమస్యలను అధిగమించగల్గుతామని కలెక్టర్ పేర్కొన్నారు. సకాలంలో లోడిరగ్, అన్‌లోడిరగ్ జరిగేందుకు సరిపడా సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రైస్ మిల్లులకు సొసైటీలు ప్రైవేట్ వాహనాలను సమకూర్చుకుని ధాన్యం తరలిస్తే, ప్రభుత్వం నిర్ణయించిన రేటును అనుసరిస్తూ రవాణా బిల్లు చెల్లిస్తామని తెలిపారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ఏ చిన్న ఇబ్బందికి సైతం తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎస్‌ఓ చంద్రప్రకాశ్, డీసీఓ సింహాచలం, డీఏఓ తిరుమల ప్రసాద్, డీటీసీ వెంకటరమణ, మార్కెటింగ్ శాఖ ఏ.డి గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.