నిజామాబాద్, అక్టోబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో నిజామాబాద్‌కు అవార్డు రావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ విభాగం ర్యాంకింగ్‌లో నిజామాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకులో నిలిచిన సందర్భంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు ఇటీవలే ఢల్లీిలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించిన విషయం విదితమే.
ఈ నేపధ్యాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ‘ఆత్మీయ సన్మానం – ఉద్యోగుల సమ్మేళనం’ నిర్వహించారు. అవార్డు గ్రహీతలైన కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులను టీఎన్జీవోల సంఘం తరఫున ఘనంగా సన్మానించారు.
కలెక్టర్ నాయకత్వంలో జిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం ఎంతో గొప్ప విషయమని వక్తలు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ విభాగంలో కేంద్ర బృందాలు దేశ వ్యాప్తంగా 600 పైచిలుకు జిల్లాలను క్షేత్రస్థాయిలో పరిశీలించగా, స్వచ్ఛత విషయంలో నిజామాబాద్ జిల్లాకు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు లభించిందన్నారు. అవార్డు కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని, కేంద్ర బృందాలు సమగ్ర పరిశీలన అనంతరం ర్యాంకింగ్‌లు కేటాయించారని కలెక్టర్ స్పష్టం చేశారు.
గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయడం వల్లనే జిల్లాకు జాతీయ స్థాయిలో కీలక అవార్డు దక్కిందని, ఇది జిల్లా ప్రజలందరికి దక్కిన గౌరవమని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన ఉద్యోగులంతా సమిష్టిగా, కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వారుండడం వల్లే స్వచ్ఛ సర్వేక్షన్ లో జిల్లాను దేశంలోనే మూడవ స్థానంలో నిలుపగలిగామని పేర్కొన్నారు.
గ్రామాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అన్నివర్గాల వారి సహకారంతో జిల్లాలో ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం కూడా సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పది ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, వాటిలోనూ నాలుగు జీ.పీలు నిజామాబాద్ జిల్లాకు చెందినవే ఉన్నాయని గుర్తు చేశారు. పల్లె ప్రక్రుతి వనాలు, వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్లు, హరితహారం కార్యక్రమాల ఆధారంగా ఇకముందు కూడా కేంద్రం ప్రకటించనున్న జాతీయ స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీలలో నిజామాబాద్ జిల్లా నుండి అత్యధిక గ్రామ సచివాలయాలు ఎంపికవుతాయని కలెక్టర్ గట్టి నమ్మకం వ్యక్తపర్చారు.
స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, అంకిత భావంతో సమిష్టిగా కృషి చేస్తే తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందనడానికి జిల్లాకు దక్కిన అవార్డులే నిదర్శనమని అన్నారు. ఇకముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో ల సంఘం ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూ, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు సైతం తోడ్పాటును అందించడం ద్వారా పెద్దన్న పాత్ర పోషిస్తోందని కలెక్టర్ ప్రశంసించారు.
ఏ పని చేసినా చక్కగా, పరిపూర్ణంగా చేస్తారని టీఎన్జీవో ల సంఘం అధ్యక్షకార్యదర్శులు అలుక కిషన్, అమృత్ కుమార్‌లను, ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ నాగరాజు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్‌డీఓ చందర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.