కామారెడ్డి, అక్టోబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతోందని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ముందుగానే అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సదుపాయం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
బయో మెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల హాజరు నమోదు చేస్తారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ఉన్నందున అభ్యర్థులను పరీక్షా కేంద్రాల లోపలికి ఉదయం 8.30 నుంచి అనుమతించాలని సూచించారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 4,549 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో సూచికల బోర్డులు అమర్చుతామని, టాయిలెట్స్, విద్యుత్ సదుపాయం, సీసీ కెమెరాలు సక్రమంగా ఉండేలా చూస్తామని అన్నారు. పరీక్షా సమయంలో ప్రతీ అరగంటకు ఒకసారి అభ్యర్థులకు సమయం తెలియజేసేలా సిబ్బందిని ఆదేశిస్తామన్నారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్, బంగారు అభరణాలు తీసుకురావద్దని సూచించారు.
విలువైన వస్తువులు ఇంటి వద్ద పెట్టుకొని రావాలని కోరారు.కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్ 9989215590 అభ్యర్థులకు సందేహాలు ఉంటే ఫోన్ చేసి పరిష్కారం పొందాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.